LOADING

Type to search

హైదరాబాద్ లో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

News Recent

హైదరాబాద్ లో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

admin1 January 21, 2015
Share

హైదరాబాద్ లో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ప్రజలు దీని బారిన పడుతున్నారని అన్నారు. సాధారణ జలుబు లక్షణాలు ఉండటంతో ప్రజలు స్వైన్ ఫ్లూను గుర్తించలేక పోతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈ వ్యాధికి జలుబు, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటాయని వివరించారు. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి వేగంగా సోకుతోందని అన్నారు. ప్రతీఒక్కరు బయటకు వెళ్లేటపుడు మాస్క్ లు ధరించాలని సూచించారు. దీంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీలైనంత తక్కువ సమయం ఉండాలని వివరించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 

ఈ ఏడాది అత్యధిక మృతుల సంఖ్య, కేసులు తెలంగాణాలోనే నమోదుకావడం గమనార్హం. ఇప్పటి వరకు తెలంగాణాలో 130 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. 108 కేసులు, మూడు మరణాలతో ఢిల్లీ రెండో స్థానంలో, 39 కేసులు, 11 మరణాలతో రాజస్థాన్‌ మూడో స్థానంలో, 31 కేసులు, రెండు మరణాలతో గుజరాత్‌ నాలుగో స్థానంలో, 28 కేసులు, మూడు మరణాలతో తమిళనాడు ఐదో స్థానంలో వుంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈ వ్యాధి బారిన పడిన 27 మందికి చికిత్స అందిస్తుండగా, మంగళవారం మరో నలుగురు ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రిలో చేరారు. దీంతోపాటు మరో 10 మంది చిన్నారులు సహా 35 మందికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానంతో వారిని అబ్జర్వేషన్‌లో వుంచి, చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులో మంగళవారం తొలిసారిగా ఈ వ్యాధితో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (ఆర్‌జిజిజిహెచ్‌) లో ఒక వ్యక్తి (58) మరణించాడు. ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అతడు, చివరి నిమిషంలో తమ వద్దకు వచ్చాడని, అప్పటికే పరిస్థితి విషమించిందని ఆర్‌జిజిజిహెచ్‌ వైద్యులు తెలిపారు. పంజాబ్‌లో కూడా స్వైన్‌ ఫ్లూ వ్యాధితో మంగళవారం ఒక మహిళ (55) మృతిచెందింది. ఈమె అమృత్‌సర్‌లోనిసంధు కాలనీ నివాసి సరబ్‌జిత్‌ కౌర్‌. చాలా క్లిష్టమైన పరిస్థితిలో జనవరి 17న కౌర్‌ తమ ఆస్పత్రిలో చేరినట్లు ఎస్కార్ట్స్‌ ఫార్టిస్‌ ఆస్పత్రి వైద్యులు హెచ్‌పి సింగ్‌ తెలిపారు. హర్యానాలో నలుగురు, చండీగఢ్‌లో ఒకరు ఈ వ్యాధితో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌, ఒడిషా, రాజస్తాన్‌, దేశరాజధాని ఢిల్లీలో కూడా ఈ వ్యాధితో మృత్యువాత పడిన కేసులు నమోదయ్యాయి. గుర్‌గావ్‌లో ఇప్పటివరకూ ముగ్గురు ఈ వ్యాధితో మరణించారు.

ఈ వ్యాధిబారిన పడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభు త్వాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు పంపింది. బహిరంగ ప్రదేశాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, స్వైన్‌ఫ్లూ లక్షణాలు, నిర్థారణ, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది.
రాష్ట్రంలోనూ బెంబేలు

స్వైన్‌ఫ్లూ దేశవ్యాప్తంగానే గాక రాష్ట్రంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తూ.. వణికిస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఒకరు స్వైన్‌ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అసలే డెంగ్యూ, వైరల్‌ జ్వరాలతో భయపడుతుంటే పులి మీద పుట్రలా స్వైన్‌ప్లూ విస్తరిస్తుండడం కలకలం రేపుతోంది. వ్యాధి బారినపడి ఒకరు మరణించడంతో ప్రకాశం జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఆస్పత్రుల్లో పలు రకాల పరీక్షలు చేయించుకుని సాధారణ జలుబు, జ్వరమని తేలాకే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎక్కువ మందిలో జలుబు, దగ్గు, జ్వరం కనిపిస్తోంది. వాతావరణంలో మార్పుల వల్లే ఈ సమస్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు రాగానే అందరూ తొలుత స్వైన్‌ప్లూ అనుమానంతో తల్లడిల్లుతున్నారు. ఒంగోలు రిమ్స్‌లో ఆ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
జిల్లాలోని పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలేనికి చెందిన శివకృష్ణ స్వైన్‌ఫ్లూతో ఈ నెల 10వ తేదీన మృతి చెందాడు. ఆయనకు వ్యాధి ప్రబలినట్లు తెలియగానే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. 240 గృహాల ప్రజలకు వ్యాధిపట్ల అవగాహన కల్పించారు. అతనితో సన్నిహితంగా ఉండే 15 మందికి పరీక్షలు జరిపారు. ఎవరిలోనూ స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించలేదు. ముందు జాగ్రత్త చర్యగా వారికి టామీ ఫ్లూ మాత్రలు పంపిణీ చేశారు. ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో శివకృష్ణకు వైద్యమందించిన సుమారు 15 మందికి టామీ ఫ్లూ మాత్రలు అందించారు. శింగరాయకొండకు చెందిన శివకుమార్‌కు ప్రస్తుతం ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అనధికారికంగా పంగులూరు మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ ఈ కేసులున్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఒక యువకుడు(22), చిత్తూరుకు చెందిన ఓ యువతి(22) కాకినాడ జిజిహెచ్‌లో ఈనెల 9న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరారు. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి స్వైన్‌ప్లూ బారినపడినట్లు నిర్దారించారు. వారం రోజులపాటు వారికి చికిత్స అందించి, ఈనెల 17న డిశ్చార్జి చేశారు. వీరిద్దరూ ఉన్నత విద్యకోసం హైదరాబాద్‌లో ఉంటున్న సమయంలో స్వైన్‌ఫ్లూ బారినపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పూలబజార్‌కు చెందిన సుష్మా(31)కి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడినట్లు ఎస్‌బిహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీదేవి సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

Tags:

You Might also Like

Translate »