LOADING

Type to search

హ్యాట్రిక్‌పై గురి!

Cricket Recent

హ్యాట్రిక్‌పై గురి!

admin1 April 23, 2016
Share

హైదరాబాద్: యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, విలియమ్సన్‌లాంటి కీలక ఆటగాళ్ల అవసరం కూడా లేకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత రెండు మ్యాచ్‌లలో సత్తా చాటింది.  వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమితో టోర్నీని మొదలుపెట్టి వరుసగా రెండు విజయాలు సాధించింది. ముందుగా సొంతగడ్డపై ముంబైని చిత్తు చేసిన వార్నర్ సేన, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో ప్రత్యర్థి గుజరాత్ లయన్స్‌పై భారీ విజయం సాధించింది. దీంతో శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  రాత్రి గం.8.00లకు కింగ్స్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.

లయన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్లతో అద్భుత విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ టీమ్ రాణిస్తోంది. ముఖ్యంగా వార్నర్ నాలుగు మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీలతో అద్భుతంగా ఆడుతుండగా, గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ధావన్ కూడా దూసుకొచ్చాడు. ఇదే ఓపెనింగ్ భాగస్వామ్యం మరోసారి చెలరేగితే ఆ తర్వాత మోర్గాన్, హెన్రిక్స్, దీపక్ హుడాల రాణింపుతో భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్‌లోనైతే ముస్తఫిజుర్ సూపర్ కటర్‌లకుతోడు  భువనేశ్వర్ కూడా తన స్వింగ్‌తో సత్తా చాటుతున్నాడు. శరణ్, బిపుల్ గొప్పగా రాణించకపోయినా, వరుస విజయాలు సాధించడంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. యువరాజ్ సింగ్ నగరానికి చేరుకున్నా, అతను పూర్తి ఫిట్‌గా లేడు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగడం లేదు.  మరోవైపు ప్రత్యర్థి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్‌లో అందరికంటే బలహీన జట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో మరో విజయం సాధిస్తే సీజన్‌లో దూసుకుపోవచ్చు.

పుణేతో మ్యాచ్‌లో సంచలన విజయం సాధించి ఒక్కసారిగా సీన్‌లోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆ తర్వాత కోల్‌కతాపై పేలవ ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్లు విజయ్, వోహ్రా మాత్రమే చెప్పుకోదగినట్లుగా రాణిస్తున్నారు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్, మిల్లర్ కలిపి నాలుగు మ్యాచ్‌లలో 75 పరుగులు మాత్రమే చేయగలగడం వారి వైఫల్యాన్ని సూచిస్తోంది.  బౌలింగ్‌లో కూడా పెద్దగా రాణించలేకపోతోంది. మోహిత్ , సందీప్ ఫర్వాలేదనిపించినా నిలకడ లేదు. ఈ మ్యాచ్‌లో కైల్ అబాట్ స్థానంలో మిషెల్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే పంజాబ్ గత ఏడాదిలాగే లీగ్‌లో పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.61461409850_625x300

Translate »