కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అమృత్ కాల్‌లో భాగంగా పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే , పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.