ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా జోరు వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరో 4 రోజులు పరిస్థితులు
ఇలాగే ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎక్కడికక్కడ ప్రాజెక్టుల గేట్లు తెరచి.. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. ముంపు ప్రాంతాల
ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్లు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కాలనీల్లోకి నీరు చేరాయి. నగరంలో మరో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
నగరంలో 100 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని.., జాగ్రత్తగా ఉండాలని అధికారులు
హెచ్చరికలు జారీ చేశారు.ఆగస్టులో ముఖం చాటేసిన వరణుడు ఆలస్యంగానైనా రావడంతో పంటలకు ప్రాణం పోసినట్లైందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి.
దీనికి తోడు ఏపీ, తెలంగాణ మీదుగా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ఈ మేరకు తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు