ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది.
భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే
ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
మరో రెండు, మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి.
పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుండటంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపద్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 24 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. ఇక నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపధ్యంలో విద్యా సంస్ధలకు సెలవులు ప్రకటించారు అధికారులు.