సెప్టెంబర్ 17వ తేదీన జరిగే జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని భారత రాష్ట్ర సమితి శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్, ఆరోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా హైదరాబాద్ నగరంలో ఈ వేడుకలో పాల్గొంటారని దీంతోపాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాలలో నిర్వహించే సంబరాలకు మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేస్తారని తెలిపారు. దీంతోపాటు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు కేటీఆర్. అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవం పై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు.
1948 సెప్టెంబర్ 17… సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజని, రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయన్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనేవున్నాయన్న మంత్రి కేటీఆర్, అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణ జీవనాడిని కలుషితం చెయ్యాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.