11-700 డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం
బహదూర్ పల్లిలో పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంత్రి తలసాని పంపిణీ
పటాన్ చెరు నియోజకవర్గంలో పంపిణీచేయనున్న హరీష్ రావు
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత పంపిణీ
బండ్లగూడలో పంపిణీ చేయనున్న మహమూద్ అలీ
తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రెండు పడక గదుల ఇళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఇళ్లు పొందారు. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం అయింది. ఒకేసారి భారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా GHMC పరిధిలో ఇవాళ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో.. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పీ.మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు ఆయా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11వేల 700 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు. ఈ దఫాలో ఇల్లు దక్కని వారు మరో విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి తలసాని చెప్పారు.