ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనుంది. అక్టోబరు మొదటి వారంలో సభ నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో నిర్వహించిన ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్ సమన్వయ కమిటీ చర్చించింది. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్ మీటింగ్లో ప్రధానంగా లేవనెత్తనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒకతాటిపైకి వచ్చాయి. కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.