హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) లో ఇండిగో 6ఈ 897 విమానం (Indigo Flight) అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. బెంగుళూరు నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారిమళ్లించినట్లు విమాన అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం వారణాసికి విమానం బయలుదేరగా.. కాసేపటికే విమానంలో సాంకేతికలోపం తలెత్తడాన్ని పైలెట్ గుర్తించారు. వెంటనే సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు రాడార్ సిబ్బందికి తెలియజేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా శంషాబాద్ విమానాశ్రయ సిబ్బందిని కోరారు. అనుమతి లభించడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని విమానానికి మరమత్తులు చేపట్టారు. కాసేపట్లో ఇండిగో విమానం తిరిగి వారణాసికి బయలుదేరి వెళ్లనుంది. లోపాన్ని పైలెట్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా భావిస్తున్నారు. ఫ్లైట్ రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ల్యాంగింగ్ తీసుకుంటున్నామని, అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను దింపివేసి వారణాసి వెళ్లాల్సిన మరో విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.