భద్రచాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మెుత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులతో జంబో లిస్ట్ విడుదల చేశారు.
భద్రాచలం నియోజవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావుకు పార్టీలో చేరిన మూడ్రోజుల్లోనే టికెట్ సాధించారు. మాజీ ఎంపీ పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావు.. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల్లోనే మళ్లీ సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావును భద్రాచలం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వైఎస్సాఆర్‌సీపీలో పనిచేశారు. పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందగా.. తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పొంగులేటితో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
2018 ఎన్నికల్లో భద్రాచలం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన భద్రాచలం బీఆర్‌ఎస్ ఇంఛార్జ్‌గా కొనసాగారు. అయితే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించి పార్టీకి దూరమవ్వగా… తెల్లం కూడా గూలాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే ఈనెల 17న మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన దాదాపు మూడ్రోజులకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది.